Thursday 27 September 2012

వీకెండ్ @ కడియం

మా ఊరు కాకినాడకు రమారమి 45 కి.మీ దూరంలో ఆంధ్రాలోనే నర్సరీలకు ప్రసిధ్ది అయిన కడియపులంక అనే గ్రామం ఉంది. ఇక్కడ చాలా నర్సరీలు ఉంటాయి. మేము ఎప్పటినుండో కడియపులంక వెళ్లాలని అనుకొంటున్నాము. వెళ్లే మార్గంలో బిక్కఓలు, బలభధ్రపురం, ద్వారపూడి గ్రామాలలో ఫేమస్ టెంపుల్స్ ఉన్నాయి. వాటిని చూసుకొని వెళ్లాలని ప్రోగ్రాం.

సండే ప్రోగ్రాం పెట్టుకొన్నాం.మా రెండో బావగారు(శ్రీను), తోటికోడలు(సంధ్య), వాళ్ల అబ్బాయి (ప్రణీత్) మా ఇంటికి వచ్చారు. వాళ్లకీ కడియం వెళ్ళే ఉద్దేశ్యం ఉండడంతో కలసి వెళ్ళాలని నిర్ణయించుకొన్నాo. 
మా పెద్ద అమ్మాయి శ్రావ్య, కిషోర్, నేను, మా చిన్న అమ్మాయి వర్షిత
ఉదయం 9 గంటలకు కారులో బయలుదేరాం. మధ్యాహ్నం లంచ్ కోసం బిర్యానీ సంధ్య తెచ్చారు. టీ, సాయంత్రానికి టిఫిన్, స్నాక్స్ నేను తీసుకువెళ్ళాను. సామర్లకోట ఏ.డీ.బీ రోడ్డు ప్రక్కగా పచ్చని పంట చేలు ఆహ్లాదకరంగా ఉన్నాయి. పిల్లలు కబుర్లు, పాటలు... పిక్నిక్  పిక్నిక్ లానే జరుగుతుంది. 
బావగారు(శ్రీను), తోటికోడలు(సంధ్య)
బలభద్రపురం సాయిబాబా గుడిదగ్గర ఆగాం. ఈక్కడి సాయిబాబా గుడికి ఆంధ్రా శిరిడీ అనే పేరుకూడా ఉంది. రెండంతస్తులుగా ఉన్న ఈ గుడిలో గ్రౌండ్ ఫ్లోరులో కళ్యాణ మండపం, పైన సాయిబాబా మూలవిరాట్ ఉన్నాయి. ప్రశాంతమైన ధ్యానమందిరం కూడా ఉంది.
ఆంధ్రా శిరిడీ సాయిబాబా
వ్యక్తిగతంగా నాకు సాయి తత్వం ఇష్టం. ఇంతకుముందు నేను మూడుసార్లు శిరిడీ వెళ్ళాను. ఇక్కడి బాబా గుడి చాలా బాగుంది. ధ్యానమందిరంలో కొంతసేపు కూర్చోవాలని ఉన్నా, ప్రోగ్రాం షెడ్యూల్ గురించి ఎక్కువ సమయం ఎక్కడా గడపడానికి ఆస్కారం లేదు.
బలభద్రపురం సాయిబాబా గుడి
ద్వారపూడి అయ్యప్ప దేవాలయం చాలా ప్రసిద్ది. కేరళాలో శబరిమలై వెళ్ళలేని వాళ్ళు ఇరుముడితో ఇక్కడికి వచ్చి స్వామిని దర్శిస్తారు. ఇక్కడకూడా శబరిమలైలోవలే ఒకేరాతిపై మలచిన 18 మెట్లు ఉన్నాయి. 
ఇదే ప్రాంగణంలోనే శివాలయం, దుర్గాదేవి ఆలయం, శనీశ్వరుడి ఆలయం, నాగదేవత గుడి, సాయిబాబా గుడి, దాని వెనుకే పవళించి ఉన్న అద్భుతమైన అనంత పద్మనాభుని గర్భ గుడి, భూగర్భ జ్యోతిర్లింగాల ఆలయం ఉన్నాయి. ఈ జ్యోతిర్లింగాల ఆలయనికి ఒక ప్రత్యేకత ఉంది. భారతదేశం మొత్తానికి వెండితో చేసిని శివలింగం ఇది ఒక్కటేనట. వెండి బల్లీ, బంగారం బల్లీ ఉన్నాయి. దీనికి పైన విష్ణుమూర్తి దశావతారాల ఆలయం  నిర్మాణంలో ఉంది. 
ఈ ప్రాంగణం ఎంట్రన్స్ లో పెద్ద నటరాజు, నందీశ్వరుడు, హనుమమంతుడు, నందీ, పంచముఖ ఆంజనేయస్వామి, శివకేశవుల ఏక విగ్రహమూ ఉన్నాయి. ఫోటోలు తీసుకొన్నాం.
కడియపులంక వెళ్లేసరికి ఒంటిగంటన్నర అయిపోయింది. ఎండ నిప్పులు చెరిగేస్తుంది. కడియపులంక అంటే మా పిల్లలకి చాలా ఇష్టం. ఎందుకంటే, ముందుసారి రెండుసంవత్సరాలక్రితం వెళ్ళినప్పుడు, ఒక మోటారు షెడ్డు దగ్గర పిక్నిక్ చేసుకొన్నాం. మోటరు నుంచి పెద్దగా శబ్దం చేస్తూ బయటకు వచ్చే నీరు చూస్తూ, నీటి తుంపరలు మీద పడుతుండగా లంచ్ చేసాం అప్పుడు. ఇప్పుడు కూడా అలాగే ఉంటుందని అనుకోంటూ చాలా ఆనందంగా ఉన్నారు. కానీ, మళ్ళీ అలంటి అవకాశం దొరకలేదు మాకు. ఎక్కడా అటువంటి ప్లేస్ కనిపించలేదు ఈ సారి. భోజనాలు ముగించి కొంచంసేపు విశ్రాంతి తీసుకొని నర్సరీలలోకి వెళ్ళాం.  
బెస్ట్ పార్ట్ ఆఫ్ ద పిక్నిక్ ఇదే. ఫోటోలు తీసుకొన్నాం, చల్లని సాయంత్రపుగాలిని అస్వాదిస్తూ, పూలమొక్కల వరసల మధ్య నడిచాం,
పిల్లలు చాలా ఆనందంగా ఆటలాడుకొన్నారు,
వర్షిత
శ్రావ్య 
ప్రణీత్
మొక్కలు కొనుక్కొన్నాం. వేమగిరిలో మంచి కుండీలు దొరుకుతాయని తెలిసి అక్కడికివెళ్ళాం. అక్కడినుంచి బయలుదేరి ఇంటికిచేరే సరికి రాత్రి 9 అయ్యింది. చాలా అలసిపొయాం. కానీ, మంచి వీకెండ్ గడిపిన జ్ఞాపకాలు బాగుంటాయి.